జిడిపిలో 100 శాతానికి మించొచ్చు..ఐఎంఎఫ్ హెచ్చరిక
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇబ్బడిమబ్బడి అప్పులపై అంతర్జాతీయ ఎజెన్సీలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యస్థ కాలానికి జిడిపిలో ప్రభుత్వ అప్పులు 100 శాతానికి మించొచ్చని మంగళవారం హెచ్చరించింది. దీర్ఘకాల అప్పుల అధిక రిస్కులను ఎదుర్కోవడానికి భారత్‌కు గణనీయమైన పెట్టుబడులు అవసరమని ఐక్యరాజ్య సమితికి చెందిన ఐఎంఎఫ్ పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఏడాది కాలం స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)కి సమానమైన అప్పులను 100 శాతంగా భావిస్తారు.”ప్రాధాన్యంగా రాయితీతో కూడిన ఫైనాన్సింగ్ వనరులు, అదే విధంగా ప్రయివేటు రంగ పెట్టుబడులు, సమానమైన యంత్రాంగం అవసరం. అసాధారణమైన ఆర్థిక సహాయం లేకుండా లేదా డిఫాల్ట్‌కు వెళ్లకుండా ప్రభుత్వం దాని ప్రస్తుత, భవిష్యత్తు చెల్లింపు బాధ్యతలన్నింటినీ తీర్చగలిగితే దేశం రుణం స్థిరమైనదిగా పరిగణించబడుతుంది.” అని ఐఎంఎఫ్ పేర్కొంది. ”అధిక మూలధన వ్యయం, ఉపాధి ఆధారంగా ఇటీవల భారత వృద్ధి రేటు అంచనాలను మధ్యస్థ కాలానికి 6 శాతం నుంచి 6.3 శాతానికి పెంచినట్లు పేర్కొంది. భారత ఆర్థిక వృద్థి సమతూల్యంగా ఉన్నప్పటికీ.. వచ్చే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. సమీప కాలంలో ప్రపంచ వృద్థి మందగమించడం ద్వారా భారత వాణిజ్యం ప్రభావితం కానుంది. సరఫరాలో లోపాలు తలెత్తడంతో కమోడిటీ ధరలు పెరుగొచ్చు.. దీంతో విత్త లోటుల ఒత్తిడి నెలకొనవచ్చు.” అని ఐఎంఎఫ్ తెలిపింది. ”దేశీయంగా వాతావరణ ప్రతికూలాంశాలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను మళ్లీ పెంచొచ్చు. అహార ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు పెరగొచ్చు. అంచనాల కంటే వినియోగదారుల డిమాండ్ పెరగడంతో ప్రయివేటు పెట్టుబడుల్లోనూ వృద్థి చోటు చేసుకోవచ్చు. భారత్ 7-8 శాతం మధ్య వృద్థి రేటును నమోదు చేయవచ్చు.” అని పేర్కొంది. 2005-06లో భారత జిడిపిలో అప్పులు 81 శాతంగా ఉండగా.. 2021-22 నాటికి 84 శాతానికి ఎగిశాయని.. ఆ తర్వాత 2022-23లో 81 వాతానికి తగ్గాయని ఫండ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెవి సుబ్రమణ్యయన్ పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం ఇటీవల అడ్డగోలుగా అప్పులు చేస్తోన్న విషయం తెలిసిందే. 2023 సెప్టెంబర్ ముగింపు నాటికి భారతదేశ మొత్తం అప్పులు రూ.205 లక్షల కోట్లకు చేరాయి. ఇంతక్రితం మార్చి త్రైమాసికం నాటికి రూ.200 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఇదే సమయం నాటికి రూ.1.34 లక్షల కోట్లుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ అప్పులు.. సెప్టెంబర్ ముగింపు నాటికి రూ.161.1 లక్షల కోట్లకు చేరాయి.