తొమ్మిదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం


 PM Modi: పదేళ్లుగా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోంది: మోదీ


పెనుకొండ: మన పన్నుల వ్యవస్థ సరళంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్‌ అకాడమీ (నాసిన్‌)ను ప్రధాని మంగళవారం ప్రారంభించారు..


అనంతరం ఆయన మాట్లాడుతూ...''వెనుకబడిన సత్యసాయి జిల్లాలో నాసిన్‌ ఏర్పాటు చేశాం. ఇది ప్రముఖ శిక్షణా సంస్థగా, సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా మారనుంది. సత్యసాయిబాబా స్వస్థలం పుట్టపర్తి కూడా ఈ జిల్లాలోనే ఉంది. గాంధీజీ అనేక సార్లు రామరాజ్యం గురించి ప్రస్తావించారు. రామరాజ్యంలో అందినట్లు ప్రజలకు సుపరిపాలన అందాలని ఆయన చెప్పారు. సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండాలి.


జీఎస్‌టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చాం


నాసిన్‌.. దేశంలో ఆధునిక ఎకో సిస్టంగా మారనుంది. ఇక్కడ జరిగే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఎంతో ప్రయోజనం. రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేది. భూమి నీటిని గ్రహించి ఆవిరై తిరిగి వర్షంగా కురిసినట్టు పన్నుల విధానం ఉండాలి. జీఎస్‌టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చాం. ఆదాయపన్ను చెల్లింపు విధానాన్నీ సులభతరం చేశాం. మేం వచ్చాక ఆదాయపన్ను పరిమితి పెంచాం. పన్ను చెల్లించే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో పన్నులు వసూలవుతున్నాయి. వచ్చే ఆదాయంతో దేశంలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పదేళ్లుగా పన్ను రాబడి పెరిగింది. ఆ మొత్తంతో పెండింగ్‌లో ఉన్న అనేక పనులను పూర్తి చేశాం.


25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం


పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వారి కోసం పదేళ్లుగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మా పథకాలు కాగితాలపై కాదు.. క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి. తొమ్మిదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం


. పేదల సమస్యలు తొలగించడమే ప్రభుత్వ ప్రాధాన్యం కావాలి. వారి జీవితాలు బాగుపడ్డాయనే విషయం నీతిఆయోగ్‌ చెప్పింది. వివిధ ఉపాధి అవకాశాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు తెచ్చాం. అనేక కార్యక్రమాల వల్ల మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరుగుతోంది. పదేళ్లుగా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోంది. మేం వచ్చాక వాణిజ్య విధానాన్ని సులభతరం చేశాం'' అని వివరించారు.