ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు: అచ్చెన్నాయుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ దోపిడీపై శనివారం తెలుగుదేశం-జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు..


వైకాపా అధికారంలోకి రాగానే తెదేపా ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. ఇసుక మాఫియాతో సీఎం జగన్ ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు లూటీ చేశారని ఆరోపించారు..


''రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని తేలుస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు, నకిలీ బిల్లుల పుస్తకాలు, తదితర ఆధారాలతో కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి వెళ్లింది. అయినప్పటికీ జగన్ ఇసుక దోపిడి మాత్రం ఆపటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతల కనుసన్నల్లో 500కి పైగా రీచ్‌ల్లో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో తెదేపా-జనసేన ఆందోళనలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఇరు పార్టీల శ్రేణులు ఇసుక రీచ్‌ల వద్ద నిరసనలు తెలియజేస్తాం. వైకాపా అక్రమ ఇసుక దోపిడీకి సంబంధించిన ఫొటోలు, సెల్ఫీల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతాం'' అని అచ్చెన్న తెలిపారు..