ATM లో ఇదో కొత్త తరహా మోసం

ATM లో ఇదో కొత్త తరహా మోసం



విశాఖ;

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త తరహాలో ఏటీఎం కేంద్రం నుంచి నగదు చోరీ చేసిన ఘటన మల్కాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.... పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం కోరమాండల్‌ గేటు పక్కన ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రం ఉంది. అక్కడ పగటి పూట కాపలాదారులు ఉండరు. దీన్ని గమనించిన చోరులు.. ఏటీఎం మిషన్‌లో కార్డు వినియోగించే చోట కొద్దిపాటి మార్పులు చేసి, ఏదైనా సమస్య ఉంటే కింది నంబర్‌కు కాల్‌ చేయాలని ఓ కాగితం అతికించారు. ఖాతాదారులు ఎవరైనా వచ్చి తమ కార్డుతో నగదు తీసే ప్రయత్నం చేయగా... ఆ కార్డు మిషన్‌లోకి వెళ్లిపోతోంది. అప్పటికే ఏటీఎం సమీప ప్రాంతంలో నిరీక్షిస్తున్న ఓ వ్యక్తి వచ్చి కార్డు బయటకు తీసేందుకు సహాయం చేస్తున్నట్టు నటించి, ఏటీఎం కేంద్రం లోపల అతికించిన ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించేవాడు. దీంతో నలుగురు బాధితులు వేర్వేరు సమయాల్లో ఇలా మోసపోయి,   కేంద్రంలో ఉన్న ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేశారు. అవతల వ్యక్తి ఖాతాదారులు వివరాలు సేకరించి.. నగరంలోని దొండపర్తిలో ఉన్న మరో ఏటీఎం కేంద్రం నుంచి నగదు డ్రా చేశాడు. మొత్తం నలుగురి ఖాతాల నుంచి సుమారు రూ.లక్ష మాయమైనట్టు గుర్తించిన బాధితులు మల్కాపురం స్టేషన్‌లో  ఫిర్యాదులు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్‌బీఐ అధికారుల సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు. సీఐ సన్యాసినాయుడు పర్యవేక్షిస్తున్నారు.