*నేటి నుంచి ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్...
*
_ఉద్యోగులు ఎవరి వైపు మొగ్గు చూపేనో..?_
రాష్ట్రంలో హోమ్ ఓటింగ్ స్టార్ట్ అయింది. ఎనభై ఏళ్లు దాటిన వృద్ధుల ఇళ్లకు ఎన్నికల సిబ్బంది నేరుగా వెళ్ళి ఓట్లు వేయిస్తున్నారు. ఇదంతా పకడ్బంధీగా సాగుతోంది. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా వీడియో కెమెరాలను పెట్టి మరీ రికార్డు చేస్తున్నారు.
ఈ నెల 10వ తేదీ వరకూ హోమ్ ఓటింగ్ జరగనుంది.
వారు ఎవరికి ఓటు వేసారు అన్నది పరమ సీక్రేట్. అది ఈవీఎంలు తెరచుకున్న మీదటనే బయటపడుతుంది.
ఇక రెండవ వర్గం ఓటింగ్ కి సర్వం సిద్ధం అయింది. వారే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్ ని వాడతారు.
అలా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏపీలో ఈ నెల 4న ప్రారంభం అవుతోంది.
ఈనెల 4న ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు, మైక్రో అబ్జర్వర్లకు, ఈనెల 5వ తేదీ ఓపిఓలకు, 6వ తేదీ పోలీస్ సిబ్బంది, ఎసెన్షియల్ సర్వీసెస్, డ్రైవర్లు వీడియో గ్రాఫర్లు తదితరులు ఓటు వేస్తారు. దాని కోసం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ని ఏర్పాటు చేస్తున్నారు.
ఇక విధులలో ఉన్న ఉద్యోగులందరూ ఈ నెల 6 నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కుని ఉపయోగించుకోబోతున్నారు.
అంటే ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వం కోసం మొదట ఓటెత్తేది వీరే అన్న మాట. ఒక విషయం ఇక్కడ చెప్పాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు తలచుకుంటే ప్రభుత్వాలు మారుతాయని... ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం ఉంటే ప్రభుత్వాలకు మూడిందని కూడా గత చరిత్రలు నిరూపించాయి.
ఇపుడు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధమైన భావనతో ఉన్నారు అన్నది చూడాల్సి ఉంది. వారు బయటకు చెప్పరు కానీ సైలెంట్ ఓటింగ్ చేసి పారేస్తారు.
ఇపుడు ఉద్యోగుల ముందు ఒక్కటే ఆప్షన్ ఉంది. పాత ప్రభుత్వాన్ని తేవడమా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కొనసాగించడమా అన్నదే ఆప్షన్.
రెండు ప్రభుత్వాలతో ఉద్యోగులకు సాధక బాధలు ఉన్నాయి. మరి వారు తెలివైన వారు కాబట్టి ఆచి తూచి నిర్ణయం తీసుకుంటారనే అనుకోవాలి..
చూడాలి మరి ప్రభుత్వ ఉద్యోగి ఓటు ఏ వైపునకు మళ్ళుతుందో. అదే శుభారంభంగా మారి ఎవరిని గెలిపిస్తుందో.