జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ చామకూరి*సమర్థవంతంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల  అమలుకు కృషి*


*అందరి సహకారంతో... జిల్లా అభివృద్ధికి పాటుపడతా*


*అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా పని చేయడం అదృష్టంగా భావిస్తా*


*జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ చామకూరి*


రాయచోటి, జూలై 7: రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్ధవంతంగా అమలు చేసి... అందరి సహకారంతో అన్నమయ్య జిల్లా అభివృద్ధికి పాటు పడతామని అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. 


ఆదివారం ఉదయం రాయచోటి కలెక్టరేట్ కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కలెక్టర్ ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాలు అనంతరం ఉదయం 11:32 గంటలకు శ్రీధర్ చామకూరి అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2016 ఐఏఎస్ బ్యాచ్ కు చెంది బాపట్ల జాయింట్ కలెక్టర్ గా పని చేస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా నియమించిందన్నారు. ఇది తన మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్ అని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలు, జిల్లా అధికారుల బృందం, ప్రజా ప్రతినిధులు, ప్రజలు అందరి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లా అభివృద్ధికి పాటు పడతామని పేర్కొన్నారు. 


అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్,  డిఆర్ఓ సత్యనారాయణ రావులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లాలోని ఆర్డీవోలు, పలువురు జిల్లా అధికారులు, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు, పాత్రికేయులు, ప్రముఖులు తదితరులు పుష్పగుచ్చాలు, పూల మొక్కలతో జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికి తమ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

------------------/////--------------

*డిపిఆర్ఓ, అన్నమయ్య జిల్లా వారిచే జారీ చేయబడినది*