కొండవీడు ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చి సి.యం స్వప్నం నెరవేర్చాలి. ప్రత్తిపాటి

 కొండవీడు ప్రాంతాన్ని టూరిజం

హబ్ గా మార్చి సి.యం స్వప్నం నెరవేర్చాలి. ప్రత్తిపాటి


న్యూస్ 9 చిలకలూరిపేట: కొండవీడు కోట ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చి సీఎం చంద్రబాబు నాయుడు  స్వప్నని నెరవేర్చే విధంగా చర్యలు చేపట్టాలని,టూరిజం శాఖ మంత్రిని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా  ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అభ్యర్థించారు.

సుమారు 700 సంవత్సరాల క్రిందటే, రెడ్డిరాజుల రాజధానిగా వర్ధిల్లిన కొండవీడు కోట ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడి  అభీష్టానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ ను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు కోరడడం జరిగింది. శాసనసభా సమావేశాల సందర్భంగా పర్యాటక రంగం పై జరిగిన చర్చలో పురాతన చరిత్ర కలిగిన కొండవీడు కోట విశిష్ఠతను, పర్యాటక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్దడానికి ఉన్న అవకాశాలను ప్రత్తిపాటి సభకు వివరించారు. కొండవీడు కోట పైన సంవత్సరాంతం నీటితో ఉండే 3 సరస్సులు, ఊట బావి ఉన్నాయని, అలాగే శివాలయం, నరసింహ స్వామి ఆలయం, లక్ష్మీ దేవి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, వేమన్న స్వామి ఆలయం, కత్తుల బావి వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయని ప్రత్తిపాటి తెలిపారు.2019 లో కొండ పైకి ఘాట్ రోడ్డు నిర్మాణం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయంలోనే  జరిగిందని,ఆ ఘాట్ రోడ్డు ప్రారంభోత్సవ సమయంలో బాబు ఘాట్ రోడ్డు నిర్మాణం చూసి తిరుపతి ఘాట్ రోడ్డును తలపించే విధంగా ఈ రోడ్డు ఉన్నదని ప్రశంసించారని వారు తెలిపారు. ఆ రోజు జరిగిన బహిరంగ సభలో బాబు చౌడవరం నుండి టన్నెల్ ద్వారా 5 కిలోమీటర్ల దూరంలో రహదారి నిర్మాణం చేపడతానని, కలకత్తా - చెన్నై జాతీయ రహదారి నుండి కేవలం నిముషాల వ్యవధిలో కొండవీడుకు పర్యాటకులు చేరుకునే విదంగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారని ప్రత్తిపాటి పుల్లారావు సభకు గుర్తు చేశారు. అక్కడ పెద్దగా అభివృద్ధి చేయకుండానే పర్యాటకులు పెద్ద ఎత్తున ఇప్పటికే వస్తున్నారని అక్కడ పర్యాటక శాఖ మరింత దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తే, రాజధాని అమరావతి కి అత్యంత సమీపంలో ఉండే పెద్ద పర్యాటక కేంద్రంగా కొండవీడు మారుతుందని, తద్వారా రాష్ర్ట ఆదాయం, స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అక్కడ ఉన్న నవనీత కృష్ణుని ఏకశిలా విగ్రహం, ఆలయం శ్రీ కృష్ణ దేవరాయలు కాలంలో నిర్మించడం జరిగిందని,ప్రపంచంలో అటువంటి విగ్రహం ఎక్కడా లేదని, అందుకే సదరు ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించడానికి ఇస్కాన్ సంస్థ వారు ముందుకు వచ్చారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అలాగే అక్కడ గోల్కొండ హోటల్స్ అధినేత నడికట్టు రామిరెడ్డి వంటి పారిశ్రామికవేత్తలు 10 ఎకరాలు కేటాయిస్తే, 5 స్టార్ హోటల్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ముందుకు వచ్చారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కొండవీడు కోట ప్రాంతాన్ని టూరిజం హబ్ గా అభివృద్ది చేయడానికి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు.