విద్యపై ప్రభుత్వం చెయ్యవలసింది ఆర్భాటం కాదు విద్యా ప్రమాణాలు పెంచడం,
విద్యపై ప్రభుత్వం చెయ్యవలసింది ఆర్భాటం కాదు విద్యా ప్రమాణాలు పెంచడం, పర్యవేక్షణ చెయ్యడం - దామోదర్
ప్రభుత్వ పాఠశాలలలోని విద్యపై ప్రభుత్వం చెయ్యవలసింది ప్రచార ఆర్భాటం కాదు, ప్రభుత్వ పాఠశాలలలోని చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడం అలాగే ప్రభుత్వ పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ అవసరం అని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ విజయనగరం జిల్లా కార్యదర్శి ఆకుల దామోదర రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అయినా తామేదో ప్రభుత్వ పాఠశాలలను ఉద్ధరిస్తున్నట్టు ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడమే తప్పా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అని అన్నారు. గౌరవ విద్యా శాఖా మంత్రి గారి వ్యాసం ఓ పత్రికలో నేను చదివాను ఆ సారాంశం క్లుప్తంగా...బడులు తెరిచే నాటికి 35,94,774 మందికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందజేసాం. నాణ్యమైన యూనిఫామ్, బ్యాగు, బూట్లు, బెల్టు, పుస్తకాలను అందించాం. తల్లికి వందనం కింద 13 వేల చొప్పున అర్హులైన 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో దాదాపు 10 వేల కోట్లు జమ చేసాం. విద్యా శాఖా మంత్రి గారు చెప్పింది నిజమే, అయితే ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా మరి ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరగకుండా ఎందుకు తగ్గుతున్నట్టు? ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఎందుకు దిగజారుతున్నాయి? గౌరవ మంత్రి గారు వీటి గురించి సమీక్ష గాని ఆలోచన గాని చేసారా? నేను రెండు అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నా, విజ్ఞులయిన వారు కాస్త ఆలోచన చెయ్యండి.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 4,267 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 12,549 మంది అర్హత గల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థి కోసం ఏటా 70 వేల రూపాయలు వరకూ ఖర్చు చేస్తుంది. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం 21,861 మంది బాలలు తగ్గారు. వాటి వివరాలు.
సంవత్సరం - ప్రవేశాలు
2020-21. 2,31,357
2021-22. 2,30,217
2022-23. 2,07,710
2023-24. 1,90,849
2024-25. 1,73,688
2025-26. 1,51,827
పై పట్టికని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చును.
అలాగే మన ఆంధ్ర ప్రదేశ్ కి సంబందించి అసర్ ASEAR (Annual Stataus of Education Report) సర్వే గాని PARAKH (Performance Assessment Review and Analysis of Knowledge for Holistic Development) సర్వే గాని మనం గమనిస్తే క్షేత్ర స్థాయిలో ఫలితాలు ఆసించినంత స్థాయిలో లేవు. మన ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు దారుణంగా ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా మేము ప్రభుత్వ పాఠశాలల కోసం ఇది చేసాం, అది చేసాం అని చెప్పడం కాదు క్షేత్ర స్థాయిలో పరిశీలించి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పెంపొందించేలా ప్రణాళికలు రూపొందించాలి, ప్రభుత్వ పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి, ప్రజా ప్రతినిధి కూడా వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోని చదివించేలా కఠిన నిబంధన పెట్టినప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు వారి పిల్లల్ని విదేశాలలోను, కార్పోరేట్ పాఠశాలలలోను ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిస్తూ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మన మాతృ భాష అయిన తెలుగును గౌరవించాలి, అందరూ తెలూగులోనే మాట్లాడాలి, మేము ప్రభుత్వ పాఠశాలలను, మన మాతృ భాషను గౌరవిస్తూ ఎంతో చేస్తున్నాం అని చిలుక పలుకులు పలికితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.
Comments
Post a Comment