మాకివ్వాల్సిన కూలిడబ్బు కోసం ఉద్యమాలు చేయాలా?

సర్వీస్‌ రూల్స్‌, పదోన్నతుల్లోనూ తప్పని ఇక్కట్టు
7న విశాఖలో ‘ఏపీఎంఈఎస్‌ఏ’ తొలి మహా సభ 
ఏపీ ఎమ్ ఇ ఎస్ ఏ రాష్ట్ర ప్రథమ మహాసభ బ్రోచర్ ఆవిష్కరణ 
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు



విశాఖపట్నం: ఉద్యోగులు దాచుకున్న, పని చేస్తున్న కూలి డబ్బు కోసం కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు గతంలో 92రోజుల పాటు ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం రూ.6,500కోట్లు విడుదల చేసిందని, మళ్లీ ఇప్పుడు ఆ దిశగా తమను పంపించొద్దని ఆయన సూచించారు. 



రాష్ట్ర విభజన జరిగి 10ఏళ్లయినా ఇప్పటికీ సర్వీస్‌ రూల్స్‌ విషయంలో ప్రభుత్వాలు మాట్లాడకపోవడం దారుణమన్నారు. పదోన్నతల విషయంలో ఇక్కట్లు తప్పడం లేదన్నారు. ఏపీ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఎంఈఎస్‌ఏ) తొలి మహా సభ విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో వచ్చే నెల 7వ తేదీన నిర్వహించనున్నట్టు బొప్పరాజు స్పష్టం చేశారు. 



సిబ్బంది లేని మున్సిపాలిటీలు: ఏపీలో కొత్తగా ఇచ్చిన మున్సిపాలిటీలకు సరిపడా సిబ్బందినివ్వలేదని, ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని బొప్పరాజు ఆరోపించారు. ఉద్యోగులకు సరెండర్ లీవ్, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, మెడికల్‌ రియంబర్స్‌మెంట్‌ వంటివి సకాలంలో ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జీతభత్యాలిచ్చే దిక్కే లేదని, తాము దాచుకున్న డబ్బు కోసం కూడా ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సెల్లార్‌లో ఉన్న ‘జెమ్స్‌’ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విఎంసి స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వివి వామన్ రావు, ఏపీఎంఈఎస్‌ఏ అధ్యక్షుడు దొప్పలపూడి ఈశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఏపీలోని 17కార్పొరేషన్ల పరిధిలో ఉన్న వేలాది మంది ఉద్యోగులంతా ఏకతాటిపైకి తీసుకురావాలన్నదే ఆ సంఘం ముఖ్యోద్దేశ్యమని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగుల్లో ఐక్యత కోసం అంతా సమష్టిగా పని చేయాలన్నారు. ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాల్ని కాపాడేందుకే ఏపీఎంఈఎస్‌ఏ పని చేస్తుందన్నారు. 7న జరగనున్న తొలి మహా సదస్సుకు ప్రత్యేక అతిథులుగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హాజరవుతారన్నారు. వేలాది మంది మున్సిపల్‌ ఉద్యోగుల మధ్య జరగనున్న ఈ సదస్సును విజయవంతం చేయాలని ఏపీఎంఈఎస్‌ఏ అధ్యక్షులు దొప్పల పూడి ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి అక్కరబోయిన అప్పలరాజు, కోశాధికారి ఎం రవి, తదితరులు కోరారు.



ఈ కార్యక్రమంలో జెమ్స్‌ గౌరవాధ్యక్షులు వీవీ వామన్‌రావు, వి ఎం సి స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గుమ్మడి నర్సింగరావు (సింగ్‌), ఏపీ జేఏసీ విశాఖ జిల్లా చైర్మన్‌ నాగేశ్వరరావు, ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు గొండు సీతారం, విజయనగరం జిల్లా ఏపీఎంఈఎస్‌ఏ అధ్యక్షులు అప్పలరాజు, విశాఖ జిల్లా అధ్యక్షులు పీతల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బిర్లంగి శంకర్రావు, జెమ్స్‌ అధ్యక్షులు ఆడప అప్పలనాయుడు, కోశాధికారి సన్నీ, ఉమెన్‌ సెక్రటరీ పి. పద్మజ, విశాఖ జిల్లా అవుట్‌ సోర్సింగ్‌ విభాగ అధ్యక్షులు శ్రీనుబాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల సంఘం అధ్యక్షుడు మంగరాజు, శివతో పాటు ఉద్యోగుల సంఘాల నేతలు గణపతి, రాజేష్‌, వి. శ్రీనివాసరావు, వీరబాబు, అప్పలరాజు, ప్రసన్న, పోలారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏపీఎంఈఎస్ఏ రాష్ట్ర ప్రథమ మహాసభ బ్రోచర్లు ఆవిష్కరించారు.