*ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు*
*పీవో, ఏపీవోల శిక్షణ సదస్సుల్లో జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున హెచ్చరిక
*ప్రతి అంశంపైనా క్షుణ్నంగా అవగాహన పెంచుకోవాలని అధికారులకు హితవు
విశాఖపట్టణం, ఏప్రిల్ 12 ః ఎన్నికల కోడ్ నిబంధనలను సక్రమంగా అనుసరించకపోయినా.. ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని ఎన్నికల అధికారులను జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున హెచ్చరించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో భాగంగా విధులు కేటాయించిన పీవోలు, ఏపీవోలు తప్పకుండా బాధ్యతలను నిర్వర్తించాలని, తప్పించుకోవడానికి ప్రయత్నించవద్దన్నారు. ప్రతి ఒక్కరూ శిక్షణ సదస్సులకు హాజరుకావాలని, ప్రతి అంశంపైనా క్షుణ్నంగా అవగాహన పెంచుకోవాలని, అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో పీవో, ఏపీవోల తొలి విడత శిక్షణ శిబిరాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ క్రమంలో విధులు కేటాయించిన సిబ్బందితో, అధికారులతో కాసేపు మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంవోటీలు శిక్షణ అందిస్తున్న తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి, శిక్షణ అంశాలపై కలెక్టర్ మాట్లాడారు. విధులను అందరూ బాధ్యతగా నిర్వర్తించాలని, నిర్లిప్తత పనికిరాదని హెచ్చరించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న అధికారులకు వారి అర్హతల మేరకు పీవో, ఏపీవో విధులు కేటాయించామని అందరూ తప్పకుండా హాజరై వారి విధులను సమర్ధంగా నిర్వహించాలని సూచించారు. శిక్షణ సదస్సులకు సమయానికి విచ్చేసి అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని చెప్పారు. ఈవీఎంల వినియోగం, మాక్ పోలింగ్, ఇతర సాంకతిక అంశాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రధానంగా పీవో పాత్ర చాలా కీలకమని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని పీవోలకు సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను పూర్తిగా తెలుసుకొని సక్రమంగా అమలు చేయాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి సెలవులు పెట్టరాదని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే వారికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. అందరి సహకారంతో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఓటింగ్ శాతాన్ని 75 నుంచి 80 శాతం వరకు పెంచేందుకు అందరూ తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఉత్తర నియోజకవర్గ ఆర్.వో. అఖిల, పీవోలు, ఏపీవోలు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
..................................
జారీ, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విశాఖపట్టణం.