ఏపీ సీఎస్, డీజీపీలకు ఎలక్షన్ కమిషన్ సమన్లు
ఢిల్లీ: ఏపీ ఎన్నికల అనంతరం కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీలకు ఎన్నికల కమిషన్ సమ్మన్లు జారీ చేసింది..
ఏపీలో కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా వివరణ నోటీసుల్లో పేర్కొంది. రేపు (గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు హాజరవ్వాలని కోరింది. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్‌లు విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది.
పోలింగ్ అనంతరం హింసను నియంత్రించడంలో విఫలమవడానికి కారణాలు, దాడులను ముందుగా ఊహించకపోవడానికి కారకులు ఎవరనేది వివరించాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది వివరించాలని పేర్కొంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ నోటీసులు జారీ చేశారు.
రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ ఇంకా అమల్లోనే ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రజాస్వా్మ్యంలో హింసకు తావులేదని హెచ్చరించింది. కాగా ఏపీలో పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రత్యేక దృష్టిసారించినట్టు పేర్కొంది.