పిన్నెల్లి పరార్‌!

 


*పిన్నెల్లి పరార్‌!* 


 *ప్రత్యేక బృందాలతో పోలీసుల వేట తెలంగాణలో ఉన్నట్లు సమాచారం..* 


 *ఈవీఎం ధ్వంసం కేసుతో మాయం..* 


 *సంగారెడ్డిలో అరెస్టు చేసినట్లు వార్త పాలమూరులో ఓ పత్తి మిల్లులో బస* ..


 *పోలీసులు వెళ్లడానికి ముందే జంప్‌!*


 *పిన్నెల్లి వాహనం సీజ్‌..*


 *అదుపులోకి డ్రైవరు.. లుక్‌ అవుట్‌ నోటీసులు* 


 *‘గుర్తుతెలియని’ పిన్నెల్లి!* 


 *సిట్‌ రాకతోనే గుట్టు బయటపడింది* 


 *బూత్‌లోకి చొరబడి ఈవీఎం బద్దలు* 


 *లేచి నిలబడి దండం పెట్టిన పీవో* 


 *ఆయన పేరు లేకుండానే ఫిర్యాదు* 


‘ *గుర్తు తెలియని’ నిందితులపై కేసు* 


 *సిట్‌ విచారణతో కదిలిన డొంక* 


 *సీఈవో ఆఫీసు నుంచి సీసీ ఫుటేజ్‌* 


 *ఆ తర్వాతే కేసులో ఏ1గా పిన్నెల్లి* 


పోలింగ్‌ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా... లేక దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారా అనేది తెలియడంలేదు. ‘నేను ఎక్కడికీ పారి పోలేదు. పోలీసుల సూచన మేరకే హైదరాబాద్‌ వచ్చాను’ అని సుద్దపూస కబుర్లుచెప్పిన ఆయన కోసం పోలీసు ప్రత్యేక బృందాలు వేట సాగిస్తున్నాయి. పోలింగ్‌ రోజు ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు బయటపడటంతో... ఆ కేసులో పిన్నెల్లిని పోలీసులు ఏ1గా చేర్చారు. నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిలదీసింది. డీజీపీకి గట్టి ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. పిన్నెల్లి సోదరులను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలను

ఏర్పాటు చేశారు. ఈ బృందాలు హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి. పిన్నెల్లి సోదరులు విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని అనుమానించిన పోలీసులు.. అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేశారు. వారికి వ్యతిరేకంగా లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశాలకు పరారయినట్టు కూడా వార్తలు హల్‌చల్‌ చేశాయి. నిజానికి... ఈనెల 16వ తేదీనే పిన్నెల్లి బ్రదర్స్‌ హౌస్‌ అరెస్టు నుంచి తప్పించుకుని మాచర్ల వదిలి పరారయ్యారు. అయినా... పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు... ఈవీఎం ధ్వంసం కేసు నమోదు, ఈసీ కన్నెర్ర నేపథ్యంలో ఆయనకోసం వేట మొదలుపెట్టారు.


అదిగో... అక్కడ... ఇక్కడ...


బుధవారం పిన్నెల్లితో ‘ఎలుకా - పిల్లి’లాగా పోలీసుల చేజింగ్‌ కొనసాగింది. మొదట్నుంచీ పిన్నెల్లి సోదరులకు తెలంగాణలో కొందరు బీఆర్‌ఎస్‌ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వారికి సంబంధించిన ఫామ్‌హౌ్‌సలో తలదాచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ పోలీసులు ఆ కోణంలోనూ విచారణ చేపట్టారు. పిన్నెల్లి సోదరులు హైదరాబాద్‌ నుంచి వాహనంలో వెళ్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన ఏపీ పోలీసులు... సంగారెడ్డి జిల్లా పోలీసుల సహకారంతో పటాన్‌చెరు మండలం రుద్రారం సమీపంలో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో పిన్నెల్లి వాహనం అటు వైపు వచ్చింది. పోలీసులను గమనించిన వెంటనే పిన్నెల్లి సోదరులు వాహనం దిగి మరో వాహనంలో పారిపోయినట్లు తెలుస్తున్నది. ఆ సమయంలో పిన్నెల్లి తన సెల్‌ఫోన్‌ కూడా వాహనంలోనే వదిలేసినట్లు సమాచారం. అక్కడ ఉన్న పోలీసులు వాహనంతో పాటు డ్రైవర్‌ను, పిన్నెల్లి గన్‌మెన్‌ను, అతని అనుచరులను అదుపులోకి తీసుకొని సంగారెడ్డి సీసీఎస్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. వీరిని విచారించిన అనంతరం అక్కడికి వచ్చిన మాచర్ల పోలీసులకు వారిని అప్పగించారు. అయితే, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో బాత్‌రూమ్‌ సింక్‌లు తయారుచేసే ఫ్యాక్టరీ ఆవరణలో పోలీసులకు దొరికిపోయినట్టు ప్రచారం జరిగింది. కానీ... దీనిపై తెలంగాణ పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. తమ పరిధిలో అలాంటి ఘటనలేవీ జరగలేదని, దీనిపై మాచర్ల పోలీసులనే అడగాలని చెప్పారు.


మహబూబ్‌నగర్‌లోనూ తనిఖీలు...


బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన ఓ వ్యాపారికి మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు, జడ్చర్ల పరిసరాల్లో పత్తి విత్తనాల మిల్లు ఉండేది. ఏడాది క్రితమే ఆ మిల్లును మూసివేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేయడానికి సదరు వ్యాపారి టికెట్‌ ఆశించారు. అయితే ఆయనకు ఆ నియోజకవర్గం (పర్చూరు) నుంచి టికెట్‌ దక్కలేదు. అయినప్పటికీ వైసీపీతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. మాచర్ల నుంచి పరారు కాగానే.. పిన్నెల్లి సోదరులు తొలుత ఆ వ్యాపారి వద్దకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భూత్పూరు, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే, అప్పటికే ఇక్కడి నుంచి పిన్నెల్లి సోదరులు పారిపోయారు. పిన్నెల్లికి ఆశ్రయం ఇచ్చినవారినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తునట్టు తెలుస్తోంది.


దుబాయ్‌ విమానం ఎక్కాలని...


రామకృష్ణారెడ్డి దుబాయ్‌ వెళ్లేందుకు ప్లాన్‌ వేసుకున్నారని, పోలీసుల అప్రమత్తతతో ఆయన వ్యూహం బెడిసికొట్టిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వర్గాల కథనం ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు పిన్నెల్లి సోదరులు ప్లాన్‌ చేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వారు చేరుకోవాల్సి ఉంది. అయితే, అప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో ఏపీ పోలీస్‌ టీమ్‌ మాటు వేసి ఉంది. ఈ విషయం తెలుసుకొని వారు ఎయిర్‌పోర్టు వద్దకు వెళ్లలేదు. పోలీసులను తప్పించుకునేందుకు అప్పటికప్పుడు రూట్‌ మార్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అరెస్ట్‌ అయితే చాలాకాలం వరకు బయటకు రాలేమన్నా భయంతోనే విదేశాలకు పారిపోయే ఆలోచనలో వారు ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. విదేశాలకు పరారయ్యేందుకు పిన్నెల్లి సోదరులు ఒక ప్రముఖ టీవీ చానల్‌ కు చెందిన వ్యక్తుల సహకారం తీసుకున్నట్టు సమాచారం. వాస్తవానికి ఆంధ్ర సరిహద్దులు దాటే సమయంలో కూడా ఆ టీవీ చానల్‌కు చెందిన ప్రతినిధి పిన్నెల్లి సోదరులతో పాటు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఆ టీవీ చానల్‌ కు చెందిన వాహనాల్లోనే పిన్నెల్లి సోదరులు తిరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది.


కీలక అధికారి సహకారం..


పిన్నెల్లిని భద్రంగా తప్పించేందుకు కీలక పోలీసు అధికారి సహకరిస్తున్నట్లు సమాచారం! పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు పిన్నెల్లికి చేరవేస్తూ... ‘సేఫ్‌’గా తప్పించుకునే మార్గాలను సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... జగన్‌ విదేశాలకు వెళ్లేరోజునే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు తాడేపల్లి ప్యాలె్‌సలో ఆయనను కలుసుకున్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన సంగతిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ విషయంలో ఎన్నికల కమిషన్‌ సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటే పిన్నెల్లి సోదరులకు సహకరించాలని సదరు కీలక అధికారిని జగన్‌ ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలోని ఆ కీలక అధికారి పోలీసుల కదలికలను పిన్నెల్లికి చేరవేస్తున్నట్లు తెలుస్తుంది..