ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలకు పార్టీ నాయకుల పేర్లు పెట్టి ప్రచారం చేసుకోవడం న్యాయమేనా? లోక్ సత్తా!!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారు పెట్టిన పథకాలకు వారి పార్టీ నాయకుల పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకోవడం న్యాయమేనా అని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు, జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ శెక్రటరి దాసరి సురేష్ అన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా కూడా తామేదో తమ సొంత జేబులో నుండి గాని లేదా వారి వ్యాపార సంస్థల నుండి గాని తమ సొంత డబ్బు ప్రజలకు ఇస్తున్నట్టు వారి పేరు, లేదా ఆ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకొని ప్రచారం చేసుకోవడం. వారేదో పాపం దయతో ఇచ్చే వారు-ప్రజలు పుచ్చుకునే వారు మరి. ఆ పథకాలు అమలు చేస్తున్నది ప్రజలు తాము కష్టపడి సంపాదించి కడుతున్న పన్నుల డబ్బు అనే కనీస జ్ఞానం లేకపోతే ఎలా? ఒకాయనేమో తమ పార్టీ అధికారంలో ఉన్నపుడు జగనన్న, రాజన్న, వైఎస్ఆర్ అని పేర్లు పెడతారు. ఇంకొక ఆయన అధికారంలో ఉంటే చంద్రన్న, అన్న, ఎన్టీఆర్ అని పేర్లు పెట్టి ప్రచారం చేసుకోవడం. ఇంక పింఛను పుస్తకాల మీద, పట్టాదారు పాసు పుస్తకాల మీద, పొదుపు సంఘాల పుస్తకాల మీద, ఆరోగ్య భీమా మీద, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే పత్రాల మీద అంతా అధికార పార్టీ నాయకుల పోటోలే. ఈ ప్రచారానికే కోట్లాది రూపాయల ప్రజా ధనం వృథా. మన రాష్ట్రంలో నిజాయితీగా ప్రజల కోసం పని చేసే నాయకులు అయిన టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, దామోదరం సంజీవయ్య, సర్దార్ గౌతు లచ్చన్న, వావిలాల గోపాలకృష్ణ, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి వీరి పేర్లు, పోటోలు పెట్టడానికి ఎక్కడా పనికిరారు. చరిత్రను ఎలాగూ విద్యార్థులకు దూరం చేసేసారు. ఇలాంటి వారి పేర్లు, పొటోలు పెడితే ఈ నాటి తరం వారికి వారు ఎవరో కనీసం తెలుస్తుందిగా. ఆహా అంతటా మన పేరే ప్రచారంలో ఉండాలి అది ఈ నాటి రాజకీయ పార్టీల నాయకుల తీరు.
తెలుగు వారు తెలుగులోనే మాట్లాడాలి. మంచి నినాదం. కానీ అధికారంలో ఉన్న పార్టీ పెట్టే పథకాల పేర్లు మాత్రం ఆంగ్లంలో ఉండొచ్చు. ఏమి రాజ నీతి. ఉదాహరణకు అన్నా కేంటీన్. ఆంధ్ర ప్రదేశ్ అంటే అన్నపూర్ణ. చక్కగా తెలుగులో అన్నపూర్ణ ఆహార పథకం లేదా అన్నపూర్ణ ఆహార శాల అని పెట్టవచ్చుగా. అలాగే నాడు-నేడు పేరు మార్చారు. దాని పేరు స్కూల్ ఇన్ఫ్రా స్టక్చర్ ఇంప్రూవ్మెంట్ (School Infrastructure Improvement). అసలు ఈ పేరు ఎవరికయినా గుర్తు ఉంటుందా? దీనిని తెలుగులో పాఠశాల పునరుద్ధరణ, పాఠశాల పునఃపరిశీలన లేదా బడి బాగు చేద్దాం, బడి బలోపేతం చేద్దాం. ఇలా తెలుగులో చక్కగా పెట్టవచ్చు కదా. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాలలో స్వాతంత్య్ర సమరయోధుల పొటోలు ఉండేవి. ఇప్పుడు వారి స్థానంలో దేశ ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పొటోలు పెడుతున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పొటో కూడా చేరింది. మరి కొద్ది రోజులు పోతే మీ జిల్లా మంత్రుల పోటోలు, మీ నియోజక వర్గ ఎమ్మెల్యేల పొటోలు కూడా పెట్టండి అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా ఆశ్చర్య పడనక్కర లేదు. ఈ ప్రచార యావ మన నాయకులకి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఓట్లు వేసి ఎన్నకున్న నాయకులు, ప్రజలు కట్టే పన్నుల డబ్బులనే వేతనంగా తీసుకుంటూ ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన నాయకులు ప్రజల సొమ్ముతో వారి సొంత ప్రచారం, విలాసవంతమైన జీవితం, ఇదీ మన ప్రజాస్వామ్యం. ప్రజలారా కాస్త ఆలోచించండి.