Satellites: ఆకాశంలో తిరుగుతున్న శాటిలైట్లు ఎన్నో తెలుసా..?



 Satellites: ఆకాశంలో తిరుగుతున్న శాటిలైట్లు ఎన్నో తెలుసా..?


ఇంటర్నెట్‌ నుంచి జీపీఎస్‌ దాకా.. వాతావరణ అంచనాల నుంచి భూమ్మీద వనరుల అన్వేషణ దాకా.. రోజువారీ జీవితం నుంచి శాస్త్ర పరిశోధనల దాకా అన్నింటికీ శాటిలైట్లే కీలకం

ఇందుకే చాలా దేశాలు ఏటేటా మరిన్ని శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతూనే ఉన్నాయి. మరి మన భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్లు ఎన్ని?.. అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో తెలుసుకుందాం.. 


మూడు కక్ష్యల్లో.. 

ఐక్యరాజ్యసమితి ఆఫీస్‌ ఫర్‌ ఔటర్‌ స్పేస్‌ అఫైర్స్‌ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్‌ 11వ తేదీ నాటికి భూమి చుట్టూ 11,870 శాటిలైట్లు తిరుగుతున్నాయి. అవి కూడా భూమి చుట్టూ మూడు కక్ష్యలలో తిరుగుతున్నాయి. అవి జియో స్టేషనరీ ఆర్బిట్‌ (జీఈఓ), మీడియం ఎర్త్‌ ఆర్బిట్‌ (ఎంఈఓ), లో ఎర్త్‌ ఆర్బిట్‌ (ఎల్‌ఈఓ). ఇందులో జీఈఓ కక్ష్యలోకి శాటిలైట్లను ప్రయోగించడానికి భారీ రాకెట్లు కావాలి. ఖర్చు చాలా ఎక్కువ. అందుకే అక్కడ శాటిలైట్లు బాగా తక్కువ. 


జీఈఓ

భూమికి సుమారు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్ష్య ఇది. పక్కాగా భూమి భ్రమణ వేగానికి సరిపడే వేగంతో శాటిలైట్లు ప్రయాణించేందుకు అనువైన ప్రాంతమిది. అంటే జీఈఓలో తిరిగే శాటిలైట్లు ఎప్పుడూ భూమ్మీద ఒకేప్రాంతంపైనే ఫోకస్‌ చేస్తూ స్థిరంగా ఉంటాయి. కమ్యూనికేషన్, వాతావరణ శాటిలైట్లను ఈ కక్ష్యలోనే ఉంచుతారు. 


ఎంఈఓ

భూమికి పైన 2 వేల కిలోమీటర్ల నుంచి 30 వేల కిలోమీటర్ల మధ్య ఉండే ప్రాంతం ఇది. జీపీఎస్, గ్లోనాస్‌ వంటి నావిగేషన్‌ శాటిలైట్లు, రక్షణ రంగ శాటిలైట్లు వంటివాటిని ఈ కక్ష్యల్లో తిరిగేలా చేస్తారు.


ఎల్‌ఈఓ

భూమికిపైన కేవలం 150 కిలోమీటర్లనుంచి 450 కి.మీ. మధ్య ఉండే ప్లేస్‌ ఇది. ఇంటర్నెట్, ఫోన్‌ సిగ్నల్‌ సంబంధిత శాటిలైట్లు ఈ కక్ష్యల్లో ఉంటాయి. 


స్టార్‌ లింక్‌ శాటిలైట్లతో.. 

ప్రస్తుతమున్న శాటిలైట్లలో అత్యధికం ‘స్టార్‌ లింక్‌’ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సంస్థకు చెందినవే. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఆధ్వర్యంలోని స్టార్‌ లింక్‌ కోసం 6,050 శాటిలైట్లను ప్రయోగించింది. ఇవన్నీ కూడా గత ఐదేళ్లలో స్పేస్‌లోకి పంపినవే కావడం గమనార్హం. త్వరలోనే మరో 6వేల శాటిలైట్ల ప్రయోగానికి స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.