గుర్లలో జరిగిన ఘటన రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలంటే స్థానిక ప్రభుత్వాలకు సర్వాధికారాలు ఇవ్వాలి-లోక్ సత్తా!!!

 26-10-2024

గుర్లలో జరిగిన ఘటన రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలంటే స్థానిక ప్రభుత్వాలకు సర్వాధికారాలు ఇవ్వాలి-లోక్ సత్తా!!!

***************************




              ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ప్రబలిన డయేరియాతో రాష్ట్రం అంతా ఒక్క సారి ఉలికి పడింది. దీనికి ముఖ్య కారణం అక్కడ స్థానిక ప్రభుత్వం ప్రజా రోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనని అందుకే స్థానిక ప్రభుత్వాలకు సర్వాధికారాలు ఇచ్చి రాజకీయ ప్రమేయం లేకుండా చేయవలసిన అవసరం ఉందని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి సూచనలు గమనిస్తే ఆ గ్రామంలో త్రాగు నీరు, పారిశుధ్యం, మురుగు నీటి వ్యవస్థ, మంచి నీళ్ల ట్యాంకుల శుభ్రత, క్లోరినేషన్, బహిరంగ మల విసర్జన లేకుండా చూడడం, పైపు లైన్ల అమరిక, ఇవేవీ సరిగ్గా లేవు. ఆ గ్రామంలో ఈ పనులన్నీ చెయ్యవలసింది అక్కడి స్థానిక ప్రభుత్వం, అంటే ఆ గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్పించి నిధులు, నియామకాలు ఎప్పటికప్పుడు మంజూరు చేసి ఆయా గ్రామాల్లో గ్రామ కమిటీలు వేసి ఆయా గ్రామాల్లోని ప్రధాన సమస్యలను ఆ గ్రామ ప్రజలే పరిష్కరించుకనే వెసులు బాటు ఇస్తే నేడు కలెక్టర్ దగ్గర నుండి అందరు ఉన్నతాధికారులు ఆదరాబాదరాగా గ్రామాలను తనిఖీలు చెయ్యవలసిన దుస్థితి వచ్చేదికాదు. అయినా మనం ఇవ్వం ఎందుకంటే అన్నిటా మన రాజకీయ ప్రమేయం ఉండాలి. ప్రజలు ఎలా పోతే మాకేంటి? మాకు మాత్రం అన్నిటా మా ప్రమేయం ఉండాలి. సర్పంచ్ నుండీ అందరూ ఆధికార పార్టీ వారు చెప్పినట్టుగే వినాలి. ఇదీ మన నాయకుల తీరు.

                పంచాయతీ నిధులు తప్పనిసరిగా ప్రజారోగ్యానికి వినియోగించాలి. నిజంగా అలా వినియోగించి ఉంటే నేడు గుర్ల గ్రామంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నేడు మనం కృత్రిమ మేథ (Artificial Intelligence), డ్రోన్ షోల గురించి గొప్పలు చెప్పకుంటున్నాం, కానీ గ్రామాలలో మాత్రం బహిరంగ మల విసర్జనని అరికట్టలేక పోతున్నాం. దీనికి అందరం సిగ్గు పడాలి. మన జిల్లాకు వచ్చిన హోమ్ శాఖా మంత్రి గారేమో ఎవరైనా  డయేరియాతో మరణిస్తే అధికారులపై చర్యలు తప్పవు అన్నారు, మంచిదే దానికన్నా ముందు ప్రభుత్వం చెయ్యవలసింది స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసి సకాలంలో నిధులు, నియామకాలు చేసే ఏర్పాటు,  రాజకీయ ప్రమేయం లేకుండా వాటిని స్వతంత్రంగా పనిచేసుకోనివ్వడం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చెయ్యడం చాలా అవసరం. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్ని సదుపాయాలతో సక్రమంగా పనిచేస్తే ప్రజలు జిల్లా ఆసుపత్రికి వచ్చే అవసరం ఉండదు. గ్రామాల్లో ఉన్న చెరువులను కాపాడి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి సంరక్షించే ఏర్పాటు చెయ్యడం. ప్రతి గ్రామంలో మరుగు దొడ్లు ఏర్పాటు చేసి వంద శాతం బహిరంగ మల విసర్జనను అరికట్టడం. గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన కనీస మౌళిక సదుపాయాలు పంచాయితీ నిధులతో ఎప్పటికప్పుడు కల్పించడం ఇవీ చెయ్యవలసినది. ఒక సంఘటన జరగగానే దానిని రాజకీయం చెయ్యకుండా పరిష్కార దిశగా ఆలోచన చెయ్యడం కనీస మానవ లక్షణం. లోక్ సత్తా పార్టీ ఎప్పుడూ కూడా సమస్యలో భాగం అవ్వదు, పరిష్కారంలో మాత్రమే భాగం అవుతుంది. ఇప్పటికైనా పాలకులు అధికారులు ఆ దిశగా ఆలోచన చేసి ప్రజరోగ్యాన్ని కాపాడమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.