15-11-2024
పారిశ్రామిక వాడ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు-లోక్ సత్తా!
విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక వాడలో ఉన్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు గారికి లోక్ సత్తా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు చెప్పిన రెండు అంశాలు కూడా వాస్తవమే. పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం అని చెప్పి కారు చౌకగా భూములు తీసుకుని సంవత్సరాలు గడుస్తున్నా పరిశ్రమలు ఏర్పాటు చెయ్యకుండా, ఆ స్థలాలను ప్రభుత్వానికి అప్పజెప్పకుండా తాత్సారం చేస్తున్న యజమానుల నుండి తిరిగి భూమిని స్వాధీనం చేసుకుని ఔత్సాహికులైన కొత్త వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక రెండవది పరిశ్రమలు ఏర్పాటు చేసిన యాజమాన్యం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా స్థానికేతరులకు ఇవ్వడం. దీనిపై కూడా పరిశ్రమల యజమానులతో స్థానికులకు మాత్రమే ఉపాథి ఇవ్వాలని ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవలసిన అవసరం ఉంది. ఇవే కాకుండా నేను ఎమ్మెల్యే గారికి విన్నవించేది ఏంటంటే పారిశ్రామిక వాడలో మౌళిక సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా రహదారులు, త్రాగు నీటి సౌకర్యం, కాలువలు, రహదారులపై ఇరువైపులా చెట్లు నాటి పచ్చదనాన్ని పెంచడం. పారిశ్రామిక వాడలో ఎన్ని యూనిట్లు ఖాళీగా ఉన్నాయో తెలపే చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి త్వరితగతిన అనుమతులు అలాగే బ్యాంకు లోను తొందరగా వచ్చే ఏర్పాట్లు చెయ్యాలి.
మన జిల్లాలో పరిశ్రమలు అన్నీ కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. ఒకప్పుడు జిల్లాలో పదమూడు జూట్ పరిశ్రమలు, రెండు చక్కెర పరిశ్రమలు ఉండేవి. నేడు మూడు జూట్ పరిశ్రమలు మాత్రమే తిరుగుతూ మిగతా పరిశ్రమలు అన్నీ మూత పడ్డాయి అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. అందుకే మనం ముందుగా చెయ్యవలసింది వ్యవసాయ రంగాన్ని బలోపేతం చెయ్యాలి. జిల్లాలో జనపనార, చెరకు మొదలయిన వాణిజ్య పంటలను ప్రోత్సహించి రైతులను రైతు కుటుంబాలను ఆదుకోవాలి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వేలాది మంది యువతకు ఉపాథి అవకాశాలు కల్పించవచ్చు. వ్యవసాయ రంగాన్ని ఉపాది హామీ పథకానికి అనుసంధానం చేస్తే వ్యవసాయ రంగం బలోపేతం అవుతుంది. రాను రాను చెరకు సాగుబడి తగ్గి నేడు దేశం మొత్తం మీద సుక్రోజ్ ఉత్పత్తికే చెరకు పంట చాలని పరిస్థితి ఇక ఇథనాల్ తయారీకి ఎలా సరిపోతుంది? ఇదే స్థితి కొనసాగితే చక్కెర కూడా ఇతర దేశాల నుండి దిగుమతి చేసే పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్య పడనక్కరలేదు. ఒక రైతుగా గౌరవ బొబ్బిలి ఎమ్మెల్యే గారికి అనుభవం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో అలాగే మంత్రులతో మాట్లాడి ప్రధాన వాణిజ్య పంటలైన చెరకు, జనపనార పండించే రైతులను ప్రోత్సహించి ఆ పంటలను విరివిగా పండించేట్టుగా చేసి రైతులకు ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తే రైతు కుటుంబాలు, యువత భవిష్యత్తు బాగుంటుంది. ఆ దిశగా ఏమ్ఎల్ఏ గారు ప్రయత్నం చెయ్యాలని లోక్ సత్తా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను అని దామోదర రావు అన్నారు.