*స్థానిక ప్రభుత్వాలకు నిధులు, విధులు, అధికారాలను సంపూర్ణంగా బదలాయించండి, మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించండి! లోక్ సభ సెక్రెటరీ జనరల్ కు లేఖ వ్రాసిన మాదాసు..*
జులై 3,4 తేదీలలో నిర్వహించనున్న సదస్సులో ప్రజా సమస్యల పరిష్కార దిశగా చర్చించాలని లోక్ సభ సెక్రెటరీ జనరల్ కు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భాను ప్రసాద్ లేఖ వ్రాశారు.
నివారించదగిన ప్రమాదాల నుండి మనిషి ప్రాణాలను కాపాడుట మంచి పాలనకు గీటురాయి అని. కానీ, కొందరి అవగాహనారాహిత్యం, ప్రచార ఆర్భాటం, అధికారుల ఉదాసీనత ల కారణంగా నిత్యం అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మన రాష్ట్రంలో, దేశంలో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలలో చాలావరకు నివారించదగినవేనని అన్నారు. మరమ్మత్తుల పేరిట తీసే గుంతలు, రోడ్ల వెంబడి అనధికారికంగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు ఇవన్నీ ప్రమాదాలకు హేతువులని అన్నారు. కర్ణాటక, తమిళనాడులో నిషేధించబడిన ఫ్లెక్సీలను ఆంధ్రప్రదేశ్ లో కనీస నియంత్రణ లేకుండా ప్రధాన వీధులతో సహా, కార్నర్ పాయింట్స్ లో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ప్రధాన నగరాలలో మున్సిపల్ అధికారులు వారానికి ఒకసారి డ్రైవ్ నిర్వహించి రోడ్లపై ఫ్లెక్సీలను ఎప్పటికప్పుడు తొలగించే పద్ధతి ఉంది అన్నారు. కానీ పట్టణాలలో, గ్రామాలలో అటువంటి పరిస్థితి లేదు అని, ఎన్నికల ఫలితాల ప్రకటన వెలువడిన క్షణం నుండి ఐదేళ్ల అనంతరం ఎన్నికల కమిషన్ ఇచ్చే నోటిఫికేషన్ వరకు వీటిని తొలగించే పరిస్థితి లేదని, ఇది జాతీయ రహదారిపై నేషనల్ హైవేస్ ప్రధాన రహదారుల మార్గాలను సూచించే సూచిక బోర్డులు, వాటి కిలోమీటర్ల కొరకు ఏర్పాటు చేసిన బోర్డుల సైతం వదలకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుంటే అధికారులు వాటిని తొలగించే సాహసం చేయలేకపోతున్నారని అన్నారు.
కనుక, స్థానిక ప్రభుత్వాలకు రాజకీయ జోక్యం లేని అధికారాలను ఇచ్చి చట్టాలను, నిబంధనలను అతిక్రమించే వారికి ఎప్పటికప్పుడు అపరాధ రుసుము విధించే విధంగా మొబైల్ టీం లను ఏర్పాటు చేసి ప్రతిరోజు పట్టణాన్ని పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకునే విధానం ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను వాటి వల్ల జరిగే నష్టాలను నియంత్రించలేకపోవచ్చు కానీ, మన దేశంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను వాటికి కారణమైన నిర్లక్ష్యం, అజాగ్రత్త, అవగాహన రాహిత్యం వంటి వాటిపై దృష్టి సారిస్తే పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. రోడ్డుపై జరుగుతున్న అనేక ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ కారణాలని నివేదికలు చెబుతున్నాయని అన్నారు.
1919 లో అమృత్సర్ లోని జలియన్వాలా బాగ్ కాల్పులలో మరణించిన వారి సంఖ్య 379 గా ఉంటే, రోడ్డు ప్రమాదాలు కారణంగా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఒక దశాబ్ద కాలంలో చనిపోయిన వారి సంఖ్య అంతకంటే ఎక్కువ అనేది నివ్వెర గొలిపే చేదు నిజం అని అన్నారు. ఇది చాలదన్నట్లు ప్రజలకు రోజురోజుకీ సౌకర్యాలు కల్పించాల్సింది పోయి భక్తి పేరిట, రాజకీయాల పేరిట, వ్యక్తిగత వేడుకల పేరిట రోడ్లను బ్లాక్ చేయడం పరిపాటిగా మారిందని అన్నారు. ప్రధాన రోడ్లను బ్లాక్ చేసి కార్యక్రమాలు నిర్వహించేవారు, అదే రోడ్లపై అంబులెన్స్ లు, పేషెంట్లు, వృద్ధులు, వికలాంగులు, ఉపాధి కోసం ఉరుకులు పరుగులు పెట్టే ప్రజలు, పరీక్షల కోసం పరుగులు తీసే విద్యార్థులు ఉంటారనే స్పృహ లేకుండా చేయటం సరైనది కాదని అన్నారు.
సాధారణంగా ఒక మనిషి చెవి 70 డెసిబల్స్ ధ్వని మాత్రమే స్వీకరించగలదు అని నిపుణులు చెబుతున్నా, పట్టించుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో, పురవీధుల్లో 200 డెసిబల్స్ పైన ధ్వని కలిగించే విధంగా డీజే లను పెట్టడం పై తగు చర్యలు తీసుకోవాలని, మితిమీరిన డీజేల సౌండ్ కారణంగా ఇటీవల అక్కడక్కడ డ్యాన్సులు వేస్తూ ఉన్నఫలంగా మరణిస్తున్న సంఘటనలు మీడియాలో తరచూ చూస్తున్నామని, నిపుణులు డీజేల ధ్వని కారణంగా తల్లి గర్భంలోని పిండం మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని పదేపదే చెబుతున్న మాట మనం మరువకూడదని అన్నారు. కొన్ని వారాల్లో మనం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నాం. ఇన్ని సంవత్సరాలలో ఎంతో సాధించాం, కానీ సాధించగలిగినంత సాధించలేదు అనేది వాస్తవం అని అన్నారు. కనుక మీరు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు, నిధులు, విధులు బదలాయించి రోజు రోజుకు పెరిగిపోతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన సౌకర్యవంతమైన ప్రశాంత జీవితానికి భంగం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టు లాగున కార్యాచరణ రూపొందించగలరని లేఖలు కోరారు. స్థానిక సంస్థలు ఏవైనప్పటికీ , స్థానిక సంస్థలలో రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న వారికి స్వతంత్ర అధికారం చలాయించే విధంగా ప్రస్తుతం ఉన్న చట్టాలను బలోపేతం చేయాలని, స్థానిక సంస్థలకు చెందిన చట్టాలను ఉల్లంఘించే వారికి శిక్షలు విధించే అధికారాలు కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఉండాలని కోరారు.
ఇట్లు..
మాదాసు భాను ప్రసాద్,
అడ్వకేట్ & రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ లోక్ సత్తా పార్టీ,
ఆంధ్ర ప్రదేశ్.