రంగా ఒక వ్యక్తి కాదు ఒక శక్తి : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
రాణి గారి తోటలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ
రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టిడిపి రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకృష్ణ
రంగా సేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు, నాయకులు
విజయవాడ : వంగవీటి మోహన రంగా ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.. వంగవీటి మోహన రంగా 78వ జయంతి సందర్భంగా రాణిగారితోటలో రాధ రంగామిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టిడిపి రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకృష్ణ, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ్ భానులతో కలిసి వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రంగాకి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిన నాయకులు ఎప్పటికి ప్రజల్లో గుండెల్లో నిలిచి వుంటారనటానికి రంగా జీవితం ఒక ఉదాహరణ అన్నారు. రంగా ఒక వర్గానికి చెందిన నాయకుడు మాత్రమే కాదని ప్రజా నాయకుడన్నారు. ప్రజల గుండెల్లో ఆయన స్థానం చిరస్థాయిగా వుందన్నారు. ఎన్డీయే కూటమి గెలుపులో వంగవీటి రాధ కీలకపాత్ర పోషించారని, భవిష్యత్తులో సుముచిత స్థానం లభిస్తుందన్నారు.రంగా ఆశయాల కోసం అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
వంగవీటి రాధ మాట్లాడుతూ పార్టీలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. రంగా ప్రజల మనిషి, పేదల నాయకుడు అని కొనియాడారు. ఆయన చివరి శ్వాస వరకు పేదలకి అండగా నిలబడ్డారని ఉద్ఘాటించారు. రంగా ఆశయాల సాధనకు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు వంగవీటి మోహన రంగా అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎ.పి.ఐ.ఐ.సి డైరెక్టర్ మండలి రాజేష్, 17వ, 18వ డివిజన్ అధ్యక్షులు రాయి రంగమ్మ, వేముల దుర్గారావు, జనసేన నాయకులు బాడిత శంకర్ లతో పాటు రాధ రంగా మిత్ర మండలి నాయకులు,అభిమానులు పాల్గొన్నారు.