హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరం
*"ఐబొమ్మ" ఇమ్మడి రవి వలన చిత్ర పరిశ్రమకు నష్టం ఎంత,,? సినిమాల వలన యువత భవిత కు వాటిల్లుతున్న నష్టం ఎంత? ..సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్*
*హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరం*
ఐబొమ్మ ఇమ్మడి రవి వలన చిత్ర పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది కనుక రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ తీర్పులు వ్రాసేస్తున్న సినిమా పెద్దలు, సినిమాల వలన మన యువత విలువైన సమయాన్ని, బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారనే విషయం గుర్తించాలని సామాజికవేత్త భాను ప్రసాద్ అన్నారు. ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సినిమాలో నటించేవారి వారు అభినయించే పాత్రలను బట్టి "కథానాయక పాత్రధారులు" లేక "హీరో పాత్రధారి" అని సంబోధించడానికి బదులుగా ,పదాలను పూర్తిగా మార్చేసి నేటి ఎంటర్టైన్మెంట్ మీడియా నిర్వాహకులు *హీరో* అనే పదం వాడుతున్నారని, అంతేకాకుండా వాళ్లకి లేనిపోని తోకలనూ తగిలిస్తున్నారని, పత్రికలే ఆ రకంగా వ్రాస్తే అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. విద్యార్థులు హై స్కూల్ స్థాయి నుండి నటీనటులను మరి ముఖ్యంగా హీరో పాత్రధారులను ఆరాధ్యులుగా భావిస్తున్నారని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల కంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్నల కంటే, తల్లిదండ్రుల కంటే ఆర్టిస్టులు ఎట్లా గొప్పవారో ఆలోచించుకోవాలని కోరారు. కథానాయక పాత్రధారులకి 200 కోట్లు, 300 కోట్లు రెమ్యూనరేషన్ కారణం చేత సినిమా ఖర్చు పెరిగిపోతుందని గుర్తించాలని అన్నారు. అందువలన సగటు ప్రేక్షకుడు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారని కనుక, రెమ్యూనిరేషన్ తగ్గించుకోవాలని కోరారు. ఎంటర్టైన్మెంట్ మీడియా క్రియేట్ చేసిన హైప్ వలనే కథానాయక పాత్రధారులు 200 కోట్లు, 300 కోట్లు ఒక్కొక్క సినిమాకు తీసుకుంటున్నారు అని అన్నారు. ఐబొమ్మ సినిమా పైరసీ చట్ట ప్రకారం నేరం అయినప్పటికీ సామాన్య ప్రజలు రవిని ఒక నిజమైన హీరో లాగా చూస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఎంటర్టైన్మెంట్ మీడియాలో కథానాయక పాత్రధారులు లేదా హీరో పాత్రధారి అని మాత్రమే సంబోధించాలని కోరారు. "హీరో" అనే పదం వాడటం ఆపాలని, అంతేకాకుండా నటులు వాళ్లకై వాళ్ళు తగిలించుకున్న తోకలను (STAR) కత్తిరించాలని కోరారు. ఇప్పటికైనా ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరారు.

Comments
Post a Comment