మురికిపూడి ప్రసాద్ సీఆర్పీఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
మురికిపూడి ప్రసాద్
సీఆర్పీఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
వాట్సాప్‌లో బ్లూ టిక్ ఆఫ్ చేసి, ఫోన్ ఎత్తకపోవడం జవాబుదారీతనం లోపానికే నిదర్శనం
నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై 1902, అత్యవసర సమస్యలైతే 1100 ద్వారా పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయాలి
చిలకలూరిపేట............
రాష్ట్రంలో ఉన్నతాధికారుల నుంచి దిగువ స్థాయి అధికారుల వరకు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఉందని సీఆర్పీఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ సందేశాలు, ఫోన్ కాల్స్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ, పలువురు అధికారులు వాట్సాప్‌లో రీడ్ రిసీట్స్ (బ్లూ టిక్)ను ఆఫ్ చేసి, ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. దీంతో ప్రజలు పంపిన సందేశాలను అధికారులు చదివారా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.
ఈ విధానం వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ లక్ష్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఫోన్‌కు స్పందించకపోవడం, వాట్సాప్ సందేశాలను పట్టించుకోకపోవడంతో ప్రజలు తప్పనిసరిగా అధికారులను నేరుగా కలిసి తమ సమస్యలను వివరించాల్సిన పరిస్థితి వస్తోందన్నారు.
ప్రజలు నేరుగా కలిసినప్పుడు "వాట్సాప్ చూడలేదు", "సందేశం గమనించలేదు" అంటూ అధికారులు బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం, కాల్స్ ఎత్తకపోవడం ప్రజాసేవ పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసే అధికారులు, ఫోన్ కాల్స్‌కు స్పందించని అధికారులు, వాట్సాప్‌లో పంపిన సందేశాలను పట్టించుకోని అధికారులపై ప్రజలు 1902 పీజీఆర్‌ఎస్ హెల్ప్‌లైన్ ద్వారా లేదా అత్యవసర సమస్యలైతే 1100కు ఫిర్యాదు నమోదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఫిర్యాదు చేసే సమయంలో సంబంధిత అధికారికి ఎప్పుడు ఫోన్ చేశారో తెలిపే కాల్ లాగ్‌లు, ఎప్పుడు వాట్సాప్ సందేశం పంపారో తెలిపే స్క్రీన్‌షాట్లు, ఇతర ఆధారాలను జతచేస్తే విచారణకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఫిర్యాదు నమోదు అనంతరం సంబంధిత శాఖ గ్రీవెన్స్ పరిష్కార అధికారి విచారణ జరిపి, అవసరమైతే ఉన్నతాధికారుల స్థాయికి కూడా ఫిర్యాదును ఎస్కలేట్ చేసే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వం అధికారులు ప్రజల ఫోన్ కాల్స్‌కు, వాట్సాప్ సందేశాలకు నిర్దిష్ట గడువులో స్పందించేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించాలని మురికిపూడి ప్రసాద్ డిమాండ్ చేశారు.

Comments
Post a Comment