నో బ్యాగ్ డేలో వినియోగదారుల అవగాహన కార్యక్రమాలు
నో బ్యాగ్ డేలో వినియోగదారుల అవగాహన కార్యక్రమాలు
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తప్పనిసరిగా అమలు చేయాలి.
మురికిపూడి ప్రసాద్
సిఆర్పిఎఫ్ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ
చిలకలూరిపేట.....
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే ‘‘నో బ్యాగ్ డే’’ సందర్భంగా వినియోగదారుల క్లబ్‌ల ద్వారా ప్రతి నెలా వినియోగదారుల రక్షణ, హక్కులు, బాధ్యతలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసిందని సీఆర్ఫీఎఫ్ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ తెలిపారు.
ఈ మేరకు పౌర సరఫరాల కమిషనర్ కె.కన్నబాబు ఐఏఎస్ సెప్టెంబర్ 11న అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులకు సూచనలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. గతంలో జూలై 30న జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వినియోగదారుల క్లబ్‌ల ద్వారా నెలవారీ కార్యక్రమాల క్యాలెండర్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేసినట్లు తెలిపారు.
విద్యార్థులకు వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, వినియోగదారుల రక్షణ చట్టాలు, మోసాలు, నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలపై అవగాహన కల్పించడమే కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని ప్రసాద్ పేర్కొన్నారు. ఇందుకోసం ఉపాధ్యాయ మార్గదర్శకులు, పాఠశాల స్థాయి సమన్వయకర్తలకు జిల్లా విద్యాశాఖాధికారులు, గుర్తింపు పొందిన మాస్టర్ ట్రైనర్ల సమన్వయంతో శిక్షణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లు తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వినియోగదారుల క్లబ్‌ల ద్వారా నెలవారీ వినియోగదారుల రక్షణ కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలని, పాఠశాలలతో పాటు కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయాలు, స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంస్థల సమావేశాలు, కమ్యూనిటీ హాళ్లు, మార్కెట్లు, ప్రదర్శనలు, జాతరలు తదితర ప్రాంతాల్లోనూ వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించినట్లు చెప్పారు.
నిర్వహించిన ప్రతి కార్యక్రమాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారి లాగిన్ ద్వారా ‘అవగాహన’ ప్లాట్‌ఫారమ్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని, ప్రతి నెలా కార్యక్రమాల ప్రగతి నివేదికను కమిషనర్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, సమన్వయకర్తల సంఖ్య, కార్యక్రమాలు నిర్వహించిన పాఠశాలల వివరాలు, అవగాహన కార్యక్రమాలు, లబ్ధి పొందిన విద్యార్థులు, ప్రజల సంఖ్యతో పాటు ఫొటోలు, ఇతర ఆధారాలను నివేదికలో పొందుపరచాలని సూచించినట్లు వివరించారు.
రూ.25 వేల నిధులు
ప్రతి జిల్లాకు మంజూరు చేసిన రూ.25 వేల నిధులను శిక్షణ కార్యక్రమాలు, ఐఈసీ మెటీరియల్ తయారీ, అవగాహన ప్రచారాలు, ఇతర సంబంధిత కార్యక్రమాల కోసం మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ప్రసాద్ తెలిపారు. కార్యక్రమాలు పూర్తయిన అనంతరం వినియోగ ధ్రువీకరణ పత్రం, ఖర్చుల వివరాలు, బిల్లులు, వోచర్లు, కార్యక్రమ నివేదికలను సమర్పించాల్సి ఉంటుందన్నారు.
అన్ని జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు వ్యక్తిగతంగా కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షించి, జిల్లా విద్యాశాఖాధికారులు, వినియోగదారుల స్వచ్ఛంద సంస్థలు, మాస్టర్ ట్రైనర్ల సమన్వయంతో అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వంద శాతం కార్యక్రమాలు అమలయ్యేలా చూడాలని కమిషనర్ ఆదేశించినట్లు మురికిపూడి ప్రసాద్ తెలిపారు. కార్యక్రమాల అమలులో ఎలాంటి ఆలస్యం, లోపాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Comments
Post a Comment