ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం.. ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు

 ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం.. ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు



**పునరుద్ధరిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో కానరాని సేవలు.. మరో తుఫాను హెచ్చరికతో ఆందోళన*


చిలకలూరిపేట 

News9 ... ప్రజా సమస్యల పరిష్కార వెలుగు


పట్టణంలో తుఫాను ప్రభావంతో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలను కొన్ని ప్రైవేటు సంస్థలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పునరుద్ధరించక పోవడంతో చందాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్నెట్‌పై ఆధారపడిన విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు సేవలు అందుబాటులో లేక నష్టపోతున్నారు.ఈ సమస్యపై సంబంధిత సంస్థల కాల్ సెంటర్లకు ప్రతిరోజూ వందలాది మంది వినియోగదారులు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నప్పటికీ, సేవలను త్వరలోనే పునరుద్ధరిస్తామని చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారడం లేదని చందాదారులు వాపోతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల పరీక్షలు, ఆన్‌లైన్ తరగతులు, వ్యాపార లావాదేవీలు, ఉద్యోగుల విధులకు ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యను కొంతమంది వినియోగదారులు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) దృష్టికి తీసుకెళ్లగా, మరికొందరు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసినట్లు తెలిపారు.ఇదిలా ఉండగా మరో తుఫాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో వినియోగదారుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. ఇప్పటికే నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు ఎప్పుడు పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తారోనని ఎదురుచూస్తున్నారు. సంబంధిత సంస్థల ఉన్నతాధికారులు స్పందించి పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారుల ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments